అటవీ శాఖ అధికారుల తీరుపై కడెం రేషన్ డీలర్ల నిరసన
కడెం, ఆంధ్రప్రభ: ఉడుంపూర్, ఇందన్పల్లి గ్రామాల్లో అటవీ శాఖ అధికారులు రైతులు, గ్రామస్తులు, యువకులపై దాడులకు పాల్పడి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ కడెం మండల రేషన్ డీలర్లు, స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారుల తీరుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుకు మండల రేషన్ డీలర్లు, ప్రజలు తమ మద్దతు ప్రకటించారు.
కడెం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు కుకారికార్ రాజేశ్వర్ మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ స్థానిక ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో పనులు చేసుకోనీయకుండా అడ్డుకోవడం, బావులు తవ్వనీయకపోవడం, చెరువుల్లో చేపలు పట్టకుండా చేయడం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకాలు కల్పించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రైతులు, ప్రజలు, యువకులపై దౌర్జన్య వైఖరి మార్చుకోకపోతే రేషన్ డీలర్లు వేలాది మంది ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీలర్లు డి. రాజశేఖర్, ఎం. శంకర్, ఎండీ శరీపొద్దీన్, సాయిరాజ్, రాజన్న, కే. రాజమల్లు, ప్రసాద్, కే. శ్రీనివాస్, రాజేందర్, చందు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
