సీఎంను కలిసేందుకు సర్పంచుల యత్నం
అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులతో అడ్డుకోవడం అన్యాయం: సుర్వి యాదయ్య గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించుకునేందుకు యత్నించిన తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి నివాసానికి ఆరు సార్లు, సచివాలయానికి ఐదు సార్లు వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులతో అడ్డుకోవడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో శిల్పారామంలో జరిగిన రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సర్పంచులు తన ఇంటికి వస్తే టిఫిన్ చేయించి, టీ తాగిస్తానని చెప్పారని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. ఆ నమ్మకంతోనే మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లామని, కానీ కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.
ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటినా గ్రామపంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ నుంచి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధి వెనుకబడిందని, హరితహారం వంటి కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శించారు.
పారిశుధ్య లోపంతో గ్రామాలు వ్యాధుల బారిన పడే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, రాష్ట్ర నాయకులు పద్మారెడ్డి, సానబోయిన సుధాకర్ గౌడ్, కల్లట్లపల్లి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
