పట్టు పురుగుల పెంపకం రైతులకు ఆదాయ మార్గం
సబ్సిడీతో మల్బరీ సాగు, పరికరాల ఏర్పాటు: కలెక్టర్ గరిమ అగ్రవాల్
చందుర్తి, ఆంధ్రప్రభ : పట్టు పురుగుల పెంపకం రైతులకు అదనపు ఆదాయాన్ని అందించే మంచి మార్గమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
మంగళవారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో కల్లెడ శైలేష్, కల్లెడ లక్ష్మణ్ రెండు ఎకరాల్లో సాగు చేస్తున్న మల్బరీ తోట, పట్టు పురుగుల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ముందుగా మల్బరీ తోటను సందర్శించి మొక్కల రకం, సాగు విస్తీర్ణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టు పురుగుల షెడ్లో పురుగుల పెంపకం విధానాన్ని పరిశీలించి, పురుగులను ఎక్కడి నుంచి తీసుకువస్తారు, ఎంత సమయంలో పట్టు ఉత్పత్తి సిద్ధమవుతుందనే అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ మల్బరీ తోటల ఏర్పాటు, షెడ్ల నిర్మాణం, ఇతర పరికరాల కొనుగోలుకు సెరికల్చర్ శాఖ సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. కేవలం 25 రోజుల్లోనే పట్టు ఉత్పత్తి సిద్ధమవుతుందని వివరించారు.
పట్టు పురుగుల శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపాలని సూచించారు. సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, పట్టు పురుగుల శాఖ అధికారి జగన్, తహసీల్దార్ భూపతి పాల్గొన్నారు.
