హైదరాబాద్లో కుండపోత.. ఎల్లో అలర్ట్ !
- సరూర్నగర్లో 112 మి.మీ. వర్షపాతం నమోదు
- తెలంగాణలో భారీ వర్షాలు..
- 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, హనుమకొండ, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, నల్గొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి.
రాజధాని హైదరాబాద్లో సోమవారం రాత్రి నుంచి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అత్యధికంగా సరూర్నగర్లో 112 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉప్పల్లో 81.3 మి.మీ., బండ్లగూడలో 79.5 మి.మీ., హయత్నగర్లో 72.5 మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాలు, వరద నీరు నిలిచిన రహదారుల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
