సంగెం భీమలింగం వద్ద వరద ఉద్ధృతి.. నీట మునిగిన కాజ్వే

వలిగొండ, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం భీమలింగం ఆలయం వద్ద ఉన్న కాజ్వేపై మంగళవారం ఉదయం నుంచి వరద నీరు ఓవర్‌ఫ్లో అవుతోంది. జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగడంతో కాజ్వే పూర్తిగా నీట మునిగింది. దీంతో భువనగిరి మండలం బొల్లెపల్లి నుంచి వలిగొండ మండలంలోని సంగెం వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. చౌటుప్పల్‌కు వెళ్లే ప్రయాణికులు నాగిరెడ్డిపల్లి–వలిగొండ మార్గాన్ని వినియోగించాలని సూచించారు.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాజ్వే దాటేందుకు ప్రయత్నించవద్దని ఎస్‌ఐ యుగంధర్ గౌడ్ హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు నది వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి అప్రమత్తమయ్యారు. గత నెలలో ముఖ్యమంత్రి హామీతో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బ్రిడ్జి పనుల కోసం తవ్విన పిల్లర్ గుంతలు వరద ప్రవాహంలో కొట్టుకుపోవడంతో పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తహసీల్దార్ దశరథ నాయక్, ఎస్‌ఐ యుగంధర్ గౌడ్ సిబ్బందితో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.