Udayanidhi Stalin | అరెస్ట్‌పై డీఎంకే ఆగ్రహం…
అరెస్ట్‌ను న్యాయపరంగా ఎదుర్కొంటా : ఉదయనిధి స్టాలిన్
Udayanidhi Stalin | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి త్రిష, నటుడు విజయ్‌పై చేసిన సెటైరికల్ వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కేసు విచారణలో భాగంగా ఉదయనిధిని పోలీసులు అదుపులోకి తీసుకుని తంజావూరు పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. పోలీసులు తీసుకున్న చర్యలను తాను సాధారణంగా తీసుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఉదయనిధి అరెస్ట్‌పై డీఎంకే తీవ్రంగా స్పందించింది. తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరగనున్న సమయంలోనే ఉదయనిధిని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించింది. టీవీకే పార్టీని ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నారని డీఎంకే నేతలు విమర్శించారు.
ఉదయనిధిని పోలీసులు తరలిస్తున్న సమయంలో డీఎంకే నాయకులు, కార్యకర్తలు పలు చోట్ల నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నై నుంచి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని తంజావూరుకు తరలిస్తున్న నేపథ్యంలో ఉదయనిధి వాహనాన్ని అడ్డుకోవాలని డీఎంకే శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
