అభివృద్ధిపై చర్చకు సిద్ధం…
వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. అమరావతిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన మంత్రి.. రాజధాని అంశంపై గత ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రైతులతో కలిసి తాము పాదయాత్ర చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. చంద్రబాబుపై ఉన్న రాజకీయ కక్షతోనే జగన్ అమరావతిపై అప్పట్లో వ్యతిరేక ప్రచారం చేశారని ఆరోపించారు. అబద్ధాల ఆధారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తొలుత రాజధాని అమరావతికి అంగీకరించిన వైసీపీ ప్రభుత్వం.. తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని అనగాని విమర్శించారు. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల అనంతరం అమరావతిలోని నిర్మాణాల పటిష్ఠతపై సమగ్ర నివేదికలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. వాటి ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టి రెండేళ్లలో పనులను పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
