కొత్తపల్లి అండర్‌పాస్‌లో వరద నీరు తొలగింపు

పునరుద్ధరించిన రాకపోకలు..

ఊపిరి పీల్చుకున్న వాహనదారులు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద రైల్వే అండర్‌పాస్‌లో నిల్వ ఉన్న వరద నీటిని అధికారులు పూర్తిగా తొలగించారు. దీంతో పెద్దపల్లి నుంచి ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ తదితర మండలాలకు వెళ్లే ప్రజలు, వాహనదారుల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి.

గత కొన్ని రోజులుగా అండర్‌పాస్‌లో వరద నీరు నిల్వ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అధికారులు చేపట్టిన చర్యలతో అండర్‌పాస్‌లోని వరద నీటిని పూర్తిగా తొలగించడంతో ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.