క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య..
నడిగూడెం, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాటు కూలీలు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. రత్నవరం గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలు గాయపడ్డారు.
ప్రమాదం అనంతరం క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదంలో గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
