పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు…

నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు మంగళవారం ఉదయం పూర్తిస్థాయికి చేరుకుని అలుగుపై నుంచి పొంగిపొర్లుతోంది. ఎగువ ప్రాంతాలైన మంచిప్ప, గాంధారి, లింగంపేట్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో లింగంపేట్ పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.

పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు, నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అదనపు వరద జలాలు అలుగుపై నుంచి దిగువకు విడుదలవుతున్నాయి. ఈ ఏడాది కూడా భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు నిండడంతో ఆయకట్టు పరిధిలోని 20 వేల ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.