మాజీ గవర్నర్ కన్నుమూత..
- 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస
కొల్హాపూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ గవర్నర్, ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జ్ఞానదేవ్ యశవంతరావ్ పాటిల్ (డీ.వై. పాటిల్) మంగళవారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల రాజకీయ, విద్యా, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
డీ.వై. పాటిల్ భారత విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలను స్థాపించి వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో జీవితాంతం విద్యా విస్తరణకు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
రైతు కుటుంబం నుంచి గవర్నర్ స్థాయికి…
1935 అక్టోబర్ 22న మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా అంబప్ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డీ.వై. పాటిల్ తన కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారు. 1957 నుంచి 1962 వరకు కొల్హాపూర్ మేయర్‌గా సేవలందించిన ఆయన, అనంతరం 1967, 1972లో పన్హాలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత త్రిపుర, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.
విద్యకు జీవితాన్నే అంకితం..
గవర్నర్‌గా ఉన్నప్పటికీ విద్యా రంగంపైనే ప్రత్యేక దృష్టి సారించిన డీ.వై. పాటిల్, అనేక విద్యాసంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా వైద్య విద్య, సాంకేతిక విద్య, ఉన్నత విద్యా రంగాల్లో ఆయన స్థాపించిన సంస్థలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. ఆయన మరణంతో విద్యా రంగం ఓ గొప్ప దార్శనికుడిని, మహారాష్ట్ర ఓ ప్రజానాయకుడిని కోల్పోయిందని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
