కాంగ్రెస్ పాలన స్కాంల పాలనగా మారింది

కాంగ్రెస్ పాలన స్కాంల పాలనగా మారింది

  • మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రైతులకు రూ.29,300 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో 11 విడతల్లో రూ.73 వేల కోట్లను రైతుబంధు పథకం కింద రైతులకు అందించామని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రూ.90 వేల కోట్లు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.

సన్న ధాన్యానికి ఎకరాకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. కేంద్రం ఎంత ధాన్యం కొనుగోలు చేయమంటే అంతే కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. తెలంగాణలో ప్రతి సీజన్‌కు 1.45 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుండగా, అందులో సగం మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం రైతుల పట్ల అన్యాయమని పేర్కొన్నారు.

రైతు బీమా పథకం కూడా నిలిచిపోయిందని, ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించక రైతు కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రుణాలు ఇవ్వలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అందక అనేక కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.

కేసీఆర్ పాలన సంక్షేమ పథకాల పాలన అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన స్కాంల పాలనగా మారిందన్నారు. ప్రజలు స్కాంలు కాదు, సంక్షేమ పథకాలనే కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ వంద సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా నష్టం లేకుండా కాపాడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై చర్చలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ కుమార్, అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త, నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సీనియర్ నాయకుడు పోకల మనోహర్, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.