తగ్గింపు ధరల బియ్యంతో పేదలకు ఊరట..
- గుడివాడలో ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్ల ప్రారంభం
- ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజలకు మేలు జరిగే ప్రతి కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన తగ్గింపు ధరల బియ్యం విక్రయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
గుడివాడ రైతు బజార్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కౌంటర్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోలుదారులకు బియ్యం అందజేసి విక్రయాలను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు బియ్యం నాణ్యతను పరిశీలించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన ప్రతి అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. కేవలం ఎనిమిది రోజుల్లో అవసరమైన చర్యలను పూర్తి చేసి, యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురావడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టీమ్, రా బియ్యాన్ని తక్కువ ధరకే విక్రయిస్తున్నామని, ప్రతి వ్యక్తికి 10 కిలోల వరకు బియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం అభినందనీయమన్నారు. గతంలో ధాన్యం విక్రయించిన తర్వాత నెలల తరబడి చెల్లింపులు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని, వారి సహకారంతో గుడివాడలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గతంలో వర్షం వస్తే రైతు బజార్లో నీళ్ల మధ్య కూరగాయలు విక్రయించాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం అక్కడ జరిగిన మార్పులు అందరికీ కనిపిస్తున్నాయని అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో గుడివాడను మరింత అభివృద్ధి చేసి “అన్న ఎన్టీఆర్ గుడివాడ”గా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని 115 రైతు బజార్లు, సుమారు 500 రైస్ మిల్ పాయింట్లలో వ్యక్తికి 10 కిలోల చొప్పున బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని రైతు బజార్లతో పాటు 30 రైస్ మిల్ పాయింట్లలో విక్రయాలు ప్రారంభించామని, బహిరంగ మార్కెట్లో లభించే అదే నాణ్యత గల బియ్యాన్ని తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన గుడివాడ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, తహసీల్దార్ ప్రసాద్, పీడీఎఫ్ డీటీ విజయలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, రైతు బజార్ ఈవో ఓగిరాల శ్రీకాంత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీరయ్య చౌదరి, గుడివాడ అధ్యక్షుడు టీవీఎస్ ప్రసాద్, కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
