Green Society Andhra Pradesh | పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు లక్ష్యం
Green Society Andhra Pradesh | పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు లక్ష్యం
Green Society Andhra Pradesh | 50 శాతం పచ్చదనం కోసం గ్రీనింగ్ సొసైటీ వేగవంతం
సీడ్ బాల్స్ ప్రజా ఉద్యమంగా మారాలి
అరుదైన వృక్ష జాతుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
Green Society Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 50 శాతం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో పచ్చని నర్సరీని ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజా ఉద్యమంలా సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కింద నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించామని తెలిపారు. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. 50 శాతం పచ్చదనం లక్ష్యంగా ప్రతిపాదిత ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేశారు.
ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్‌కు తెలిపారు. ఈ వర్షాకాలంలో వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాల్లో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
విత్తనాలను చల్లడానికి సుమారు 40–50 డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
బాంబూసా ఆంధ్రీకమ్
అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పీసీసీఎఫ్ డాక్టర్ చలపతిరావు టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి అరుదైన వెదురు జాతి మొక్కలు పదింటిని అధికారులు గుర్తించారు. దీనికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని పేరు పెట్టారు. వీటిని రక్షించడంతోపాటు వాటి సంఖ్యను మరింత పెంచేందుకు తీసుకున్న ప్రత్యేక ప్రణాళికలను ప్రశంసించారు.
అదేవిధంగా శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల పెంపకానికి, సంరక్షణకు అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని పవన్ కళ్యాణ్ అభినందించారు.
ఈ సమావేశంలో అటవీ, పర్యావరణశాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్, పీసీసీఎఫ్ డాక్టర్ చలపతిరావు, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ సీసీఎఫ్ బీఎన్‌ఎన్ మూర్తి, సీసీఎఫ్ వైల్డ్‌లైఫ్ నాగేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.
