Kadapa | ఒకే ఇంట్లో రెండు ప్రాణాలు బలి…

Kadapa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కడప జిల్లా కేంద్రంలోని దండోరా కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కూతురు హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కుమార్తె ఓ యువకుడిని ప్రేమించడం తండ్రికి నచ్చకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కూతురిపై ఆగ్రహంతో ఆమెపై దాడి చేసి హత్య చేసిన నిందితుడు, అనంతరం జరిగిన గొడవలో భార్యపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ఇంట్లో భార్య, కుమార్తెను హతమార్చిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఘటనకు గల పూర్తి కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ద్విహత్య ఘటనతో దండోరా కాలనీలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.