హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం
హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం
యలమంచిలి (ఆంధ్రప్రభ): అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. భువనేశ్వర్ నుంచి చెన్నైకి 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును వెంటనే రహదారి పక్కకు నిలిపివేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడగలిగారు.
బస్సు వెనుక భాగంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికుల సామానులో కొంత భాగం కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, సాంకేతిక లోపం లేదా ఇతర కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరించారు.
