డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు అందించాలి: ఎస్పీ మహేష్ బి. గితే

ఎల్లారెడ్డిపేట, ఆంధ్రప్రభ : జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వాటికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.

మంగళవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్ఎస్ఐ (అడ్మిన్) ఆధ్వర్యంలో నార్కోటిక్ జాగిలం సహాయంతో ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కిరాణా దుకాణాలు, పాన్ షాపులు, బస్టాండ్, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, కొనుగోలు, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొంటూ, వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు లేదా సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.