రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

నిజాంపేట, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు, ప్రైవేట్ పాఠశాలల బస్సుల యాజమాన్యానికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రామాయంపేట సీఐ బి. సైదా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ప్రతి ఆటోలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తదితర చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సీఐ పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల వాహన డ్రైవర్లు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రయాణ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు మురళీధర్, సునీత, రైటర్ రాజునాయక్, కానిస్టేబుళ్లు అశోక్, హరీష్, రమేష్, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.