నీటి ఎద్దడి ప్రాంతాలపై పవన్ ఫోకస్

  • అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం చేయాలి
  • ఉభయ గోదావరి జిల్లాల 33 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత
  • రూ.3,050 కోట్ల ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష

అమరావతి, ఆంధ్రప్రభ: నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జల్ జీవన్ మిషన్ పనుల వేగాన్ని మరింత పెంచాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అమలు చేస్తున్న అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి కీలక పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులతో సమగ్రంగా చర్చించారు. రూ.3,050 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పురోగమిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు.

తీర ప్రాంతాలకు తాగునీటి భద్రత..

అమరజీవి జలధార ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 33 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమైన నిర్మాణ పనులను గడువులోగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

రూ.3,050 కోట్లతో రెండు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు..

అధికారులు సమీక్షలో పనుల పురోగతి వివరాలను వెల్లడించారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా

  • రూ.1,650 కోట్ల అంచనా వ్యయంతో మెగా వాటర్ గ్రిడ్ పథకం అమలు.
  • 10 నియోజకవర్గాల పరిధిలో సుమారు 20 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యం.
  • రెండు ఇంటేక్ వెల్స్, యాక్సెస్ బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
  • 111 MLD, 75 MLD సామర్థ్యాలతో ఏర్పాటు చేస్తున్న రెండు నీటి శుద్ధి కేంద్రాల్లో ఒకటి నిర్మాణ దశలో ఉంది.
  • ఇప్పటివరకు రూ.151 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది.
  • 182 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా

  • రూ.1,400 కోట్లతో ప్రాజెక్టు అమలు.
  • సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు.
  • ఇంటేక్ వెల్, యాక్సెస్ బ్రిడ్జి, 155 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
  • రెండు ప్రాజెక్టుల కింద కలిపి రూ.270 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
  • రెండు పథకాల పరిధిలో 400 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది.
  • నత్తనడకన సాగుతున్న పనులపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా పెరవలిలో రూ.3,050 కోట్ల అంచనా వ్యయంతో అమరజీవి జలధారకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రెండు మెగా వాటర్ గ్రిడ్ పథకాల పరిధిలో ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

పనులన్నీ నిర్ణీత గడువులో పూర్తి అయ్యేలా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కేటాయింపుల ప్రక్రియ పూర్తయ్యి కూడా నత్తనడకన సాగుతున్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పెండింగ్ అనుమతులు వెంటనే పూర్తి చేయాలి

పైప్‌లైన్ నిర్మాణాలకు సంబంధించి ఇతర శాఖల అనుమతులు పెండింగ్‌లో ఉంటే వాటిని అత్యవసరంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్లు–భవనాల శాఖ (ఆర్ అండ్ బి), జాతీయ రహదారుల అథారిటీ, పంచాయతీరాజ్ శాఖ, అవసరమైన చోట అటవీశాఖలతో సమన్వయం చేసుకుని పనులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో నిరంతర పర్యవేక్షణ

జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు పంపాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో పనుల వేగాన్ని మరింత పెంచాలని స్పష్టం చేశారు. అదే సమయంలో నిర్మాణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న జల్ జీవన్ మిషన్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నిర్మాణ పనుల నాణ్యతపై వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.