తెల్లవారుజామున పోలీసుల కార్డన్ సెర్చ్.. శాంతినగర్‌లో ఇంటింటి తనిఖీలు

తెల్లవారుజామున పోలీసుల కార్డన్ సెర్చ్.. శాంతినగర్‌లో ఇంటింటి తనిఖీలు

భూపాలపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): భూపాలపల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి డీఎస్పీ సంపత్‌రావు ఆదేశాల మేరకు సీఐ నరేష్ నేతృత్వంలో కాలనీని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటింటికీ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన వారిపై ఆరా తీస్తూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నంబర్ ప్లేట్లు, రిజిస్ట్రేషన్, బీమా, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మాదకద్రవ్యాల నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఇటీవల గంజాయి సేవిస్తున్న ఇద్దరిని, విక్రయిస్తున్న మరో ఇద్దరిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.

సీఐ నరేష్ మాట్లాడుతూ మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో భూపాలపల్లిని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ముగ్గురు ఎస్‌ఐలు, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.