ఈటలకు భారీ షాక్
బీజేపీకి గుడ్‌బై చెప్పిన ముగ్గురు సర్పంచ్‌లు..
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక
ఇల్లందకుంట, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మల్కాజిగిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరులుగా ఉన్న ముగ్గురు బీజేపీ సర్పంచ్‌లు బీఆర్ఎస్‌లో చేరారు.

సిరిసేడు గ్రామ సర్పంచ్ రేణికుంట్ల శ్యామల కుమార్, వంతడుపుల గ్రామ సర్పంచ్ సప్పి రాజేష్, టేకుర్తి గ్రామ సర్పంచ్ తోడేటి శ్రీనివాస్ మంగళవారం హైదరాబాద్‌లోని నందినీనగర్ నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల మనసుల్లో ఇప్పటికీ నిలిచివున్నాయని అన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, బీజేపీ కూడా ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్, బీజేపీలపై అసంతృప్తి పెరుగుతోందని, అందుకే అనేక మంది బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సరిగొమ్ముల వెంకటేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
