భూభారతి సిబ్బంది తొలగింపు.. రైతులకు తప్పని ఇబ్బందులు
వలిగొండ, ఆంధ్రప్రభ: ప్రభుత్వం భూభారతి ఫీల్డ్ టెక్నికల్ సిబ్బందిని తొలగించడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని తాసిల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పట్టా బదిలీ ప్రక్రియలు నిలిచిపోయాయి. భూభారతి పోర్టల్‌లో డేటా ఎంట్రీ, ఫైళ్ల అప్లోడ్ చేసే ఆపరేటర్లు లేకపోవడంతో కార్యాలయాలకు వచ్చిన రైతులు, ప్రజలు గంటల తరబడి వేచి ఉండి నిరాశగా వెనుదిరుగుతున్నారు. జిల్లాలోని 17 మండలాల్లో సోమ, మంగళవారాల్లో కలిపి దాదాపు 200 మంది రైతులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఆపరేటర్లు లేక దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో భూముల కొనుగోలు, విక్రయాలు, వారసత్వ రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వెంటనే ఆపరేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేదా ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆపరేటర్లను తొలగించే ముందు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎనిమిదేళ్లుగా భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్నామని, ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతరంగా తొలగించడం వల్ల తమ కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని వలిగొండ భూభారతి ఆపరేటర్ స్వాతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
