ఎమ్మిగనూరులో ఉద్రిక్తత..

ఎమ్మిగనూరులో ఉద్రిక్తత..

చేనేత సహకార సర్వ సభ్య సమావేశాన్ని నిరసన సెగ…
భారీ పోలీసు బందోబస్తు
ఆప్కోలో విలీనాన్ని వ్యతిరేకిస్తూ 210 మంది సంతకాలు
బిక్షమెత్తు కుంటాం కాని వీలీనాన్ని ఒప్పుకోం

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరులో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం నేపథ్యంలో పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సమావేశం అజెండాలో ఉన్న మూడవ అంశంపై గత కొన్నిరోజులుగా చేనేత ల్లో, చేనేత కళాకారుల్లో వివాదం రాజుకోవడమే ఇందుకు కారణం. ఎమ్మిగనూరు చేనేత వస్త్ర విక్రయశాలలను ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అజెండాలో చేర్చడంపై సహకార సంఘం సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ విలీన నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న నేతన్నలు నేటి సమావేశంలో తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ విలీన వ్యతిరేక పోరాటానికి రాజకీయ మద్దతు కూడా లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక వందలాది మంది అనుచర గణంతో, వామపక్ష (సిపిఐ), కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు సభ్యులకు అండగా నిలిచారు. ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే కేవలం ప్రతిపక్షమే కాకుండా కూటమి ప్రభుత్వంలోని ఒక వర్గం కూడా ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం. టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్, మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్ తమ అనుచర గణంతో నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు దయాసాగర్, తదితరులు విలీనం పేరుతో చేనేత సంఘం ఆస్తులను ఆప్కో పరం చేయవద్దని బహిరంగంగా డిమాండ్ చేశారు. సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకుంటామని వైసీపీ శ్రేణులు, నేతన్నలు, కూటమి లోని ఓ వర్గం, ఇతర ప్రతిపక్షాలు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమావేశం ప్రాంగణంతో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందు కోసం కర్నూలు నుండి ప్రత్యేక బలగాలను రప్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమావేశం ప్రత్యేక అధికారి ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ అధ్యక్షత, చేనేత జౌళి శాఖ ఏడీ నాగరాజ రావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ముందుగా అజెండా అంశాన్ని చదివి వినిపించారు. మూడవ అంశం చేనేత సహకార ఎంపోరియంలను ఆప్కోలో విలీన ప్రతిపాదనను చదువగానే ఒక్కసారిగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ విషయం పై హ్యాండ్లూం ఏడీ వివరణ ఇస్తూ ఇది విలీనం కాదని ఆప్కోతో కలసి విక్రయాలు జరుపడమేనని స్పష్టతను ఇచ్చారు. అయినా సభ్యులు ససేమిరా అంటూ ఫ్లకార్డ్ లు ప్రదర్శించారు. బిక్షమెత్తు కుంటారు కాని విలీనాన్ని ఒప్పుకోము అని తెగేసి చెప్పారు. అనంతరం తీర్మానం అంశాలు ఆమోదం, వ్యతిరేకం పై సంతకాలు సేకరించారు. ఇందులో ఆప్కోలో విలీనం కు వ్యతిరేకంగా 210 మంది సభ్యులు సంతకాలు చేశారు.

కేవలం 15 మంది తమ అభిప్రాయాలను తెలపలేదు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా వైసీపీ నియోజకవర్గ ఇంచార్జీ సైతం ఇంతకాలం మౌనంగా ఉండి సహకార సంఘం ముందు బైఠాయించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సిఐ శ్రీనివాసులు ప్రత్యేక పోలీసు బృందంతో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ సమావేశంలో సహకార సంఘ అకౌంటెంట్, సభ్యులు పాల్గొన్నారు.