విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి..
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి..
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; విద్యార్థులు పాఠ్యపుస్తకాలలోని విషయాలను మాత్రమే నేర్చుకోవడం సరిపోదని, జీవితంలో విజయవంతం కావాలంటే ఇతర రంగాల్లో కూడా చురుకుగా పాల్గొనాల్సిన అవసరం ఉందని, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, వేదికపై మాట్లాడే ధైర్యం మరియు కళాత్మక ప్రతిభను పెంపొందిస్తాయని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాలను విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అత్యంత వైభవంగా జరిగింది.

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యా ప్రదర్శనలు, ప్రతిభా ప్రదర్శనలతో సభా ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు స్వాగత నృత్యాలు, జానపద కళారూపాలు, దేశభక్తి గీతాలు, సామాజిక సందేశాలతో కూడిన నాటికలను ప్రదర్శించి అతిథులను అలరించారు. విద్యార్థులు రూపొందించిన టిఎల్ఎం ను తిలకించి, విద్యార్థుల ప్రతిభను చూసి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ….., విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సాంస్కృతిక, క్రీడా, సృజనాత్మక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి విద్యా వారోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని, భవిష్యత్ సమాజ నిర్మాణంలో విద్యార్థులే ప్రధాన శక్తిగా నిలుస్తారని, అందుకే వారిలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. డిజిటల్ విద్య, స్మార్ట్ క్లాస్‌రూమ్స్, మౌలిక వసతుల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారిని ఉన్నత లక్ష్యాల దిశగా నడిపించాలని సూచించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం విద్యతో పాటు నైతిక విలువలు కూడా ఎంతో అవసరమని కలెక్టర్ అన్నారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించగలడని ప్రోత్సహించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి ఎదగగల సామర్థ్యం కలిగి ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం లభిస్తే దేశానికి ఆదర్శంగా నిలుస్తారని అన్నారు.

విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, సైన్స్ ప్రదర్శనలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు, మెడల్స్, బహుమతులు అందజేశారు. బహుమతులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, నోడల్ అధికారి కురుమయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, నూరుద్దీన్, వెంకటయ్య మురళీధర్ రెడ్డి శోభారాణి, షర్ఫుద్దీన్, ఎస్ జి ఎఫ్ కార్యదర్శి నాగేశ్వర్ రావు, వివిధ మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
