పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించాలి…..
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించాలి…..
సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు…
చిలకలూరిపేట, ఆంద్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇప్పటివరకు దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని నమ్మబలికి ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తికాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదల కోసమేనని విమర్శించారు. ఇప్పటికే వంటగ్యాస్ ధర రూ.50,వాణిజ్య సిలిండర్ ధర రూ.1000 పెంచడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న, చిన్న టిఫిన్ సెంటర్లు,హోటళ్లు మూతపడి ఉపాధి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు చమురు ధరలు పెంచడం వలన రవాణా రంగంపై పెను భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు మరింత పెరుగుతాయని అంతిమంగా పేద ప్రజలు ధరల భారాన్ని మోయాల్సి వస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే రైతులు కనీసం మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఈ నేపథ్యంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడంతో రైతాంగంపై మరింత భారం పడుతుందని విమర్శించారు. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని,లేనిపక్షంలో ప్రభుత్వమే సబ్సిడీ భరించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ సుభాని, సిపిఐ పట్టణ కార్యదర్శి చెరుకుల నిర్మల, నియోజవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి బొంత ధనరాజు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై మరింత భారాలు మోపేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. తక్షణం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నియోజవర్గ కార్యదర్శి కే మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
