అకాల వర్షంతో తడిసిన ధాన్యం..

అకాల వర్షంతో తడిసిన ధాన్యం..
- రైతులకు అండగా వెల్టూర్ సర్పంచ్
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; ఉప్పునుంతల మండలం, వెల్టూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ చింతోజు వెంకటేష్ సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట వర్షాల వల్ల నష్టపోవడం బాధాకరమన్నారు.
తడిసిన ధాన్యాన్ని నాణ్యత పేరుతో తిరస్కరించకుండా ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లు, గోదాములు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని అధికారులను కోరారు. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అభితేజ్ రెడ్డి, భూరం నరేష్ యాదవ్, గుద్దటి బాలరాజు, ఐకెపి ఇన్‌చార్జి శేఖర్ రెడ్డి, రైతులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.
