ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం.
ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం.
9 నెలల పోరాటం ఫలించింది.
రోడ్డు ప్రమాదంతో చావుబతుకుల మధ్య పోరాడిన తౌఫిక్‌కు కొత్త జీవితం.
కర్నూలు జీజీహెచ్ వైద్యుల అద్భుతం.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడికి పునర్జన్మ.
కార్పొరేట్ ఆసుపత్రులు తిరస్కరించిన కేసును విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వ వైద్య బృందం.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు కొత్త జీవితం ప్రసాదించారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు సైతం చికిత్స అందించలేమని చేతులెత్తేసిన క్లిష్టమైన కేసును సవాలుగా స్వీకరించిన జీజీహెచ్ వైద్య బృందం నెలల తరబడి శ్రమించి యువకుడిని పూర్తిస్థాయిలో కోలుకునేలా చేసింది. నంద్యాల జిల్లాకు చెందిన 17 ఏళ్ల తౌఫిక్ గత ఏడాది ఆగస్టు 30న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జేసీబీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అతడి చిన్న, పెద్ద పేగులు తీవ్రంగా దెబ్బతిని బయటకు వచ్చాయి.
పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో పలువురు ప్రైవేట్ ఆసుపత్రులు కేసును తిరస్కరించాయి.
చివరి ఆశగా జీజీహెచ్ ఆఖరి ప్రయత్నంగా కుటుంబ సభ్యులు తౌఫిక్‌ను కర్నూలు జీజీహెచ్‌కు తీసుకురాగా అక్కడి యూనిట్-5 సర్జరీ విభాగం వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సుమారు 7 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి దెబ్బతిన్న పేగులకు చికిత్స అందించారు. ప్రమాద తీవ్రత కారణంగా తౌఫిక్ కోల్పోయిన కండర శక్తిని తిరిగి పొందేందుకు దాదాపు 8 నుంచి 9 నెలల పాటు వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించారు.
మరో క్లిష్ట సమస్యకు కూడా విజయవంతమైన చికిత్స
చికిత్స మధ్యలో తౌఫిక్‌కు ‘ఎంటెరోక్యూటేనియస్ ఫిస్టులా’ అనే అరుదైన సమస్య తలెత్తింది. అయితే వైద్యులు వెనుకడుగు వేయకుండా మరోసారి శస్త్రచికిత్స నిర్వహించి ఆ సమస్యను కూడా విజయవంతంగా అధిగమించారు. దీంతో ప్రస్తుతం తౌఫిక్ పూర్తిస్థాయిలో కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యాడు. భారీ ఖర్చుతో కూడుకున్న చికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించడంతో కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ వైద్య సేవలకు నిదర్శనం
ఇంతటి క్లిష్టమైన కేసును విజయవంతంగా పూర్తి చేసిన యూనిట్-5 సర్జరీ విభాగం, అనస్థీషియా బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. కార్పొరేట్ ఆసుపత్రులు కూడా వెనకడుగు వేసిన కేసులో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అత్యున్నత ప్రమాణాలతో వైద్యం అందించి రోగిని కాపాడటం గర్వకారణమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని పేర్కొన్నారు.
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
ఈ ఘటనను ఉదాహరణగా తీసుకుని రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా జీవితాంతం తీవ్ర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి ప్రమాదాలను నివారించాలని సూచించారు.
ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన వైద్య బృందం
సర్జరీ విభాగం – యూనిట్-5
డా. కె. మాధవి శ్యామల (చీఫ్)
డా. డి.వి. చంద్ర రెడ్డి
డా. ఎస్. శృతి
పీజీలు : డా. సాయి కుమార్, డా. దేవిక, డా. షమీర్
అనస్థీషియా విభాగం
డా. శివ నాయక్ మరియు బృందం
