పోలీస్ కొలువులకు దరఖాస్తుల ప్రారంభం

ఆగస్టు 19 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

  • సెప్టెంబర్ 9 వరకు అవకాశం
  • 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
  • కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐ వరకు నియామకాలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్ర పోలీసు శాఖలో 7,437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 19 ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.

నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7,437 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో 148 సివిల్ ఎస్‌ఐ, 14 డ్రైవర్ ఎస్‌ఐ, 12 టీఎస్‌పీఎస్‌పీ రిజర్వ్ ఎస్‌ఐ, 3 ఎక్స్‌సైజ్ స్పెషల్ ఎస్‌ఐ, 23 ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఎస్‌ఐ పోస్టులు ఉన్నాయి. అదే విధంగా 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 డ్రైవర్ కానిస్టేబుల్, 24 ఎక్స్‌సైజ్ స్పెషల్ కానిస్టేబుల్, 20 కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీవో, 7 కానిస్టేబుల్ (మెకానిక్) పీటీవో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దరఖాస్తు గడువును దృష్టిలో ఉంచుకుని, నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలను పరిశీలించి సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.