Pension Distribution | పేదల సేవలోనే అసలైన సంతృప్తి

Pension Distribution | పేదల సేవలోనే అసలైన సంతృప్తి

Pension Distribution |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : డీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ ఓర్వలేకపోతోంద‌ని, రాష్ట్రాభివృద్ధి చూసి.. వైసీపీకి ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోంద‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పేదవాడి ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందజేసినప్పుడు కలిగే ఆనందం ఎంతో ప్రత్యేకమన్నారు. అందుకే కేవలం బటన్ నొక్కి నిధులు విడుదల చేయడం కంటే ప్రజల మధ్యకు వెళ్లడానికే ప్రాధాన్యత ఇస్తున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 62.34 లక్షల కుటుంబాలకు పెన్షన్ల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేసే పరిస్థితి ఉండేదని విమర్శించారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి కనీసం నాలుగు సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అసెంబ్లీలో మహిళలకు 33శాతం సీట్లు కల్పించి రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కొనసాగిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో తాను, పవన్ కల్యాణ్ కలిసి పనిచేశామని, అనంతరం మూడు పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగాయని చంద్రబాబు గుర్తు చేశారు. జూన్ నెల తమ రాజకీయ ప్రయాణంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని, తుని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిందని పేర్కొన్నారు.