TTD| శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జ‌రిగింది. ఈసందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుతో కలిసి టీటీడీ ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ… సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో కప్పి ఆలయ శుద్ధి నిర్వహించారని చెప్పారు.

ఈ ఆగమ ప్రక్రియలో నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply