బళ్లారి రాఘవ, పింగళి వెంకయ్యకు ఘన నివాళి..

నరసరావుపేట, ఆంధ్రప్రభ : ప్రముఖ రంగస్థల నటుడు బళ్లారి రాఘవ, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌ఎస్ హాల్‌లో ఆదివారం వారి చిత్రపటాలకు జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి గంగినేని నాయుడమ్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయులను వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కళారంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన బళ్లారి రాఘవ తన నటనా వైభవంతో బ్రిటిష్ ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు.

అదేవిధంగా, దేశవ్యాప్తంగా గర్వంగా ఎగురవేస్తున్న భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య భారతదేశానికి చిరస్మరణీయమైన సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.