మండలి వెంకట కృష్ణారావు సేవలు చిరస్మరణీయం..
- జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ప్రముఖ ప్రజానాయకుడు, విద్యా, సాంస్కృతిక రంగాలకు విశేష సేవలందించిన మండలి వెంకట కృష్ణారావు 101వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు ప్రజాసేవను జీవిత లక్ష్యంగా చేసుకుని విద్య, సామాజిక సంక్షేమం, తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.

ఆయన సేవలు, ఉన్నత విలువలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత, నిబద్ధత, సేవాభావంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే వారికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వి.వి. నాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వై. సత్యకిషోర్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొని మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

