సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచాలి

ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పోలీసుల సేవలు ఉండాలి: ఎస్పీ మహేశ్ బి. గితే

రుద్రంగి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంత ప్రజలు, యువతలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పోలీసు అధికారులను ఆదేశించారు.

మంగళవారం రుద్రంగి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ, స్టేషన్‌లోని రికార్డులు, కేసుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, విధుల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గ్రామాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత పటిష్ఠం చేయాలని, రౌడీషీటర్లు, గంజాయి, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు, యువతకు గంజాయి వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని అన్నారు.

ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఎస్‌ఐ మోతిలాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.