భారీ వర్షానికి ధ్వంసమైన వికారాబాద్–పరిగి రహదారి
వికారాబాద్, ఆంధ్రప్రభ: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్–పరిగి ప్రధాన రహదారిపై ఎన్నెపల్లి సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద రోడ్డు దెబ్బతింది. రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డులో ఏర్పడిన గుంతల్లో నీరు నిలవడంతో వాహనాలపై నీరు చిమ్ముతూ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాల కారణంగా సమీపంలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారిపైకి వరద నీరు చేరి రోడ్డు కొట్టుకుపోయింది. ముఖ్యంగా ఎన్నెపల్లి వద్ద రహదారి ఎక్కువగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు ఆర్అండ్బీ అధికారులను కోరుతున్నారు.
