Visakhapatnam Clean City | నగర పరిశుభ్రత కోసం జీవీఎంసీ కొత్త కార్యాచరణ
Visakhapatnam Clean City | నగర పరిశుభ్రత కోసం జీవీఎంసీ కొత్త కార్యాచరణ
Visakhapatnam Clean City | చెత్తను నిర్లక్ష్యంగా వేస్తే తిరిగి వారికే అప్పగింత
సైక్లింగ్‌తో పర్యావరణ పరిరక్షణకు కమిషనర్ శ్రీకారం
ఏడాదిలో కీలక ప్రాజెక్టులు, పెరిగిన జీవీఎంసీ ఆదాయం
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ లక్ష్యం
Visakhapatnam Clean City | విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ ఒక మంచి ఆలోచనతో, వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ పరిధి సుమారు 700 చ.కి.మీ.లకు పైగా విస్తరించి ఉంది. అలాగే జనాభా కూడా ప్రస్తుతం 27 లక్షల వరకు ఉంది. ఇక 10 లక్షలకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇంత పెద్ద నగరంలో చెత్త సేకరణ, తరలింపు సవాల్‌గా మారింది. దీంతో కమిషనర్ ఆలోచనను తెరపైకి తెచ్చారు.
ఇక మీదట వ్యాపారులు తమ వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, నివాసాల ముందు చెత్తను నిర్లక్ష్యంగా వేస్తే అటువంటి వారిని గుర్తించి జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ఆ చెత్తను సేకరించి తిరిగి వారికే రిటర్న్ గిఫ్ట్ కింద అందజేస్తారు. ఈ ప్రక్రియను సోమవారం కమిషనర్ కేతన్ గార్గ్ కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో పెట్టారు.
ఎవరైనా క్రమపద్ధతి పాటించకుండా చెత్తను తమ దుకాణాలు, ఇళ్ల ముందు నిర్లక్ష్యంగా వేస్తే తిరిగి ఆ చెత్తను సేకరించి వారికే అందజేయాలని నిర్ణయించారు. అలాగే కొందరికి రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చారు. కాబట్టి నగర ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లు, దుకాణాల ముందు చెత్తను జీవీఎంసీ ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్లు, ఇతర కాంపాక్ట్ బిన్లు, ఎంపిక చేసిన రెడ్, గ్రీన్ బిన్‌లలో వేయాల్సి ఉంది.
అయితే ఇది కేవలం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మాత్రమేనని కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ఆంధ్రప్రభకు స్పష్టం చేశారు. దీని వల్ల నగరం మరింత పరిశుభ్రంగా మారనుందన్నారు. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన ర్యాంక్ సాధించి తీరుతామని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కమిషనర్‌గా కేతన్ గార్గ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పలు అంశాలను ఆంధ్రప్రభ బ్యూరోకు వెల్లడించారు.
తాజాగా సైక్లింగ్ ప్రక్రియ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకొని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు జీవీఎంసీలో సైక్లింగ్ ప్రారంభించారు. ఇక మీదట ప్రతి సోమవారం కమిషనర్ కేతన్ గార్గ్‌తో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు విధిగా సైకిళ్లపైనే కార్యాలయాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే తిరిగి కూడా సైకిళ్లపైనే తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది.
అయితే ఇలా సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యపరంగా కూడా కొంత మేలు చేకూరుతుందని భావించి స్వచ్ఛందంగా తాను ఈ సైక్లింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టానన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును కూడా స్పూర్తిగా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కమిషనర్ వివరించారు.
ఏడాదిలో ఎన్నో విజయాలు
కమిషనర్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావచ్చిందని, ఈ తరుణంలో ఎన్నో కీలక సదస్సులను విజయవంతం చేయగలిగామని గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ చెప్పారు.
గ్రేటర్‌లో.. వినూత్నం
- చెత్తను తొలగించకపోతే రిటర్న్ గిఫ్ట్
- ఎవరి చెత్త వారికే అప్పగింత
- తాజాగా సైక్లింగ్ ప్రయోగం
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదర్శం
- ఏడాదిలో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతం
- యోగాంధ్ర నుంచి అన్నింటికీ ఆతిథ్యం
- అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌లో కీలక ప్రాజెక్టులు
- ఆంధ్రప్రభతో గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్
గత ఏడాది యోగాంధ్రను విజయవంతం చేయడంలో జీవీఎంసీ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆ తరువాత జరిగిన పెట్టుబడుల సదస్సు, అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శన (ఐఎన్‌ఎస్, మిలాన్)తో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించగలిగామన్నారు.
అలాగే సాధారణ అభివృద్ధి పనుల్లో భాగంగా వందలాది కోట్లతో ప్రజలకు వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. ఇక ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి కావచ్చిన తరుణంలో ప్రస్తుతం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద సుమారు రూ.1,500 కోట్లతో మూడు ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు.
అందులో మధురవాడలో మంచినీటి సరఫరా ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇక నగరంలో కూడా అనేక మురుగునీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ సాధించే దిశగా అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ ఏడాది మరింత మెరుగైన ర్యాంక్ సాధించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
తాను కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత సుమారు 18 నెలల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందన్నారు. త్వరలోనే మరికొంత మంది బిల్లులను క్రమపద్ధతిలో క్లియర్ చేసి, ఇక మీదట అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఏ నెల బిల్లు మరుసటి నెల చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు.
జీవీఎంసీకి ఆదాయం బాగా పెరిగిందన్నారు. గతంలో కేవలం అన్ని విభాగాల నుంచి రూ.800 కోట్లు ఆదాయం లభించగా, ఇప్పుడు రూ.1200 కోట్లకు పెరిగిందన్నారు. అలాగే ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులపై అవగాహన కల్పించి సుమారు రూ.600 కోట్ల వరకు పన్నుల ఆదాయాన్ని ఆర్జించామన్నారు.
ఇతర విభాగాలను సమన్వయం చేసి జీవీఎంసీని ప్రగతిపథంలో పయనించే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. నగరాభివృద్ధిలో కౌన్సిల్, స్టాండింగ్ కౌన్సిల్, ప్రజాప్రతినిధులు తనకు మంచి సహకారం అందించారన్నారు. ఏడాదిలో ప్రభుత్వపరంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. భవిష్యత్తులో కూడా జీవీఎంసీని మరింతగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
అలాగే తన ఏడాది పాలనలో మీడియా కూడా చక్కని సహకారం అందించిందన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీఆర్ మూర్తి, పల్లె నల్లనయ్య, చీఫ్ సిటీ ప్లానర్ ఏ. ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజుతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏడాదిలో చేపట్టిన పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కమిషనర్‌కు గౌరవంగా అభినందనలు తెలిపారు.
