ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రామిక శకానికి శ్రీకారం
ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రామిక శకానికి శ్రీకారం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ద్వారా కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
“నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం పోర్టుకు సమీపంలోని కరగ్రహారంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మచిలీపట్నం పోర్టుకు సమీపంలో సుమారు 20 నుంచి 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో దాదాపు 82 పారిశ్రామిక ప్లాట్లు ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో ప్లాట్ 600 నుంచి 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండనున్నట్లు వెల్లడించారు.
పార్కులో అవసరమైన అన్ని మౌలిక వసతులను ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పోర్టు ఆధారిత సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఈ పార్కు కేంద్రంగా మారుతుందని తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. పోతేపల్లి ఆటోనగర్, గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ పార్కుల అభివృద్ధిని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ వేలాది మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు.
2014-19 కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు భూసేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్లే బందరు పోర్టు పనులు వేగవంతం అయ్యాయని గుర్తుచేశారు. అప్పట్లో భూసేకరణ కోసం దాదాపు రూ.200 కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు.
2026 డిసెంబర్ లేదా 2027 జనవరి నాటికి బందరు పోర్టును ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వెల్లడించారు. పోర్టు ప్రారంభానికి ముందే పరిసర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే యువతకు శిక్షణ, బ్యాంకు రుణాలు, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఇప్పటికే మూడు కంపెనీలు ఆసక్తి చూపినట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. షిప్ బిల్డింగ్ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.
అక్రమ మట్టి తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి హెచ్చరించారు. అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ రవాణా చేస్తే యంత్రాలు, ట్రాక్టర్లను సీజ్ చేయడమే కాకుండా సహకరించే అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధితో మచిలీపట్నం రూపురేఖలు మారతాయి
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
వ్యవసాయం, ఉద్యానవనం, ఆక్వాకల్చర్ కీలక రంగాలైనా, పరిశ్రమల అభివృద్ధి లేకుండా సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగి మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
మచిలీపట్నం నియోజకవర్గానికి పోర్టు ఉండటం ప్రత్యేకత అని, పోర్టు ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. పోర్టుకు ఆనుకుని 21 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో దాదాపు 83 పారిశ్రామిక ప్లాట్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం “కౌశల్యం” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్య పరీక్షలు నిర్వహించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
మచిలీపట్నం అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు దోహదం
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ, మచిలీపట్నం మహాదశ ప్రారంభమైందన్నారు. పోర్టు, రైల్వే లైన్, సమీప ఎయిర్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలతో నగరం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు.
ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఉద్యోగాల కోసం తిరిగే యువతే రేపు పరిశ్రమలు స్థాపించి మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ దీవెన్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
