వరద వస్తే దిగ్బంధమే

లోలెవల్ వంతెనలపై వరద ప్రవాహంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిన పరిస్థితి

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలతో గ్రామాల్లోని పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండల స్థాయి అధికారులు వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు సూచించారు. గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మండలంలోని గోదూరు, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, ఫకీర్ కొండాపూర్, యామాపూర్, వేములకుర్తి, బర్దిపూర్, ములరాంపూర్, ఎర్దండి, కోమటి కొండాపూర్, డబ్బా, అమ్మకపేట, ఎర్రాపూర్, ఇబ్రహీంపట్నం, కేశాపూర్, కోజన్ కొత్తూర్ గ్రామాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి.

గ్రామాల్లోని పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతినడంతో తహసీల్దార్ వరప్రసాద్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో తహసీల్దార్ వరప్రసాద్, ఎస్‌ఐ నవీన్ కుమార్ రహదారులను పరిశీలిస్తూ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మండలంలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం, ఫకీర్ కొండాపూర్–యామాపూర్, కోమటి కొండాపూర్–ఎర్దండి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెనలపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కూడా ప్రజలు గ్రామాల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరద ఉద్ధృతి తగ్గే వరకు గ్రామస్థులు దిగ్బంధంలోనే ఉండాల్సి వస్తోంది.

నాలుగు వైపులా నీటిమయం

వర్షకొండ గ్రామంలో సుమారు ఆరు వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామానికి ఇబ్రహీంపట్నం, డబ్బా, కోమటి కొండాపూర్, నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మీదుగా నాలుగు రహదారులు ఉన్నాయి. అయితే భారీ వర్షాల కారణంగా అన్ని మార్గాల్లోని లోలెవల్ వంతెనలపై వరద ప్రవహిస్తోంది.

ఇబ్రహీంపట్నం–వర్షకొండ మధ్య రెండు లోలెవల్ వంతెనలు, డబ్బా–వర్షకొండ మార్గంలో ఒకటి, వర్షకొండ–ఏర్గట్ల మార్గంలో మరో వంతెనపై వరద ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో గ్రామస్థులు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

ఇబ్రహీంపట్నం నుంచి వర్షకొండ మీదుగా కోమటి కొండాపూర్, ఎర్దండి గ్రామాలకు వెళ్లే మార్గాలు, నిజామాబాద్ జిల్లా గుమ్మిర్యాల్ నుంచి కోమటి కొండాపూర్‌కు వెళ్లే రహదారులపై కూడా లోలెవల్ వంతెనలు ఉండటంతో వరద సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

ఫకీర్ కొండాపూర్ గ్రామానికి యామాపూర్, మల్లాపూర్ మండలంలోని నడికూడ గ్రామం మీదుగా రెండు మార్గాలు ఉన్నాయి. గ్రామ శివార్లలోని రెండు లోలెవల్ వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు ఇతర గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు

మండలంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వ్యవసాయ క్షేత్రాలు నీటితో నిండిపోయాయి. గత పది రోజులుగా ఆశించినంత వర్షం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఇప్పుడు వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.

రెవెన్యూ అధికారులు చెరువులు, కుంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. గోదావరిలో కూడా వరద ప్రవాహం కొంత మేర పెరిగినట్లు అధికారులు తెలిపారు.