అల్లినగరంలో పింఛన్ల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ఎచ్చెర్ల, ఆంధ్రప్రభ : పింఛన్ సొమ్ము సరిగ్గా అందుతోందా? సచివాలయ సిబ్బంది క్రమం తప్పకుండా ఇంటికి వచ్చి ఇస్తున్నారా?” అంటూ ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో పింఛన్ అందుకుంటున్న ఓ దివ్యాంగురాలితో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఆప్యాయంగా ముచ్చటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయన నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీని పరిశీలించారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన కలెక్టర్, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేళకు పింఛన్ అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.

అల్లినగరం పంచాయతీ పరిధిలో మొత్తం 315 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అందులో వయోవృద్ధులు 112, వితంతువులు 76, అభయహస్తం 43, దివ్యాంగులు 36, చేనేత కార్మికులు 28, ఒంటరి మహిళలు 9, డప్పు కళాకారులు 7, డయాలసిస్ బాధితులు 2, కల్లుగీత కార్మికుడు 1, ఆరోగ్య పింఛనుదారుడు ఒకరు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎంపీడీవో, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.