హైదరాబాద్, ఆంధ్రప్రభ : గత పాలకుల చర్యల వల్ల 2012 బ్యాచ్ ఎస్సైలు తమ బ్యాచ్ కి చెందిన వారికి సెల్యూట్ చేయాల్సిన దుస్థితి నెలకొందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో ఎస్ఐల పదోన్నతి సమస్యను లేవనెత్తారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ… 2012లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులను భర్తీ చేశారన్నారు.
317జీవో వల్ల తమ ప్రాంతంలోని ఎస్ఐలకు 13ఏళ్ల నుంచి పదోన్నతి పొందలేదన్నారు. కేవలం నలుగురికి మాత్రమే పదోన్నతి ఇవ్వడంతో అదే బ్యాచ్ కు చెందిన ఎస్ఐలు వారి బ్యాచ్ కు చెందిన వారికి సెల్యూట్ చేయాల్సి వస్తుందన్నారు. చాలాచోట్ల ట్రాఫిక్ మహిళ పోలీస్ స్టేషన్లతో పాటు కొన్ని పోలీస్ స్టేషన్ల అప్ గ్రేడ్ చేయాల్సి ఉందన్నారు. అలా చేస్తే 2012 బ్యాచ్ కు చెందిన వారందరికీ పదోన్నతులు దక్కుతాయన్నారు. కనీసం సూపర్ న్యుమరి పోస్టులు కల్పించి పదోన్నతి అందించాలని కోరారు.