పాక్ నిర్ణయంతో యూఏఈ ఆగ్రహం

పాక్ నిర్ణయంతో యూఏఈ ఆగ్రహం
అబుదాబీ: ఇరాన్–యూఎస్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం గల్ఫ్ దేశాల మధ్య విభేదాలకు దారి తీసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదే సమయంలో దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), పాకిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, దీని వెనుక సౌదీ అరేబియాతో యూఏఈకి ఉన్న విభేదాలు కూడా కారణమని వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్ల అప్పును వెంటనే తిరిగి చెల్లించాలని యూఏఈ ప్రభుత్వం హఠాత్తుగా ఆదేశించింది. సాధారణంగా ఇటువంటి అప్పులను పొడిగించే ఆచారం ఉన్నప్పటికీ, ఈసారి యూఏఈ కఠినంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
- ఇరాన్–యూఎస్ మధ్య మధ్యవర్తిత్వం కారణం
- ఇరాన్‌కు అండగా ఉండటంపై యూఏఈ ఆగ్రహం
- 3.5 బిలియన్ డాలర్ల అప్పును తిరిగి చెల్లించండి
- పాకిస్తాన్‌కు యూఏఈ ఆదేశం
- పాకిస్తాన్‌కు అండగా సౌదీ అరేబియా
- 3 బిలియన్ డాలర్ల సహాయం
సౌదీ – యూఏఈ మధ్య ఆధిపత్య పోరు
ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ తటస్థంగా ఉంటూ మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఇరాన్ దాడుల వల్ల నష్టపోయిన యూఏఈకి పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం నచ్చలేదు. తమకు రక్షణ పరంగా అండగా ఉండాల్సిన పాకిస్తాన్, ఇరాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని యూఏఈ భావిస్తోంది. పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా, యూఏఈ మధ్య పోటీ పెరిగింది. పాకిస్తాన్ ఇటీవల సౌదీ అరేబియాతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం, సౌదీ వైపు మొగ్గు చూపడం యూఏఈకి ఆగ్రహం కలిగించింది.
యూఏఈ ప్రస్తుతం భారతదేశంతో తన ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇది కూడా పాకిస్తాన్–యూఏఈ మధ్య దూరం పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. యూఏఈ అప్పు తిరిగి చెల్లించాలని అడగడంతో పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో సౌదీ అరేబియా రంగంలోకి దిగి పాకిస్తాన్‌కు 3 బిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. దీనిని బట్టి చూస్తే, ఒకవైపు సౌదీ–పాకిస్తాన్ ఒక కూటమిగా, మరోవైపు యూఏఈ తన సొంత వ్యూహాలతో విడివిడిగా వ్యవహరిస్తోందని స్పష్టమవుతోంది.
