మార్కెట్లలో నిమ్మకాయల కొరత

మార్కెట్లలో నిమ్మకాయల కొరత
అమరావతి, ఆంధ్రప్రభ: వేసవి మండుటెండలతో రాష్ట్రంలో నిమ్మకాయ ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరాయి. కిలో నిమ్మకాయలు రూ.200 దాటగా, రాబోయే రోజుల్లో రూ.230కు చేరే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, నిమ్మరసం వినియోగం భారీగా పెరగడం, మరోవైపు పంట ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మార్కెట్లలో సరఫరా క్షీణించింది. రాష్ట్రంలోని ప్రధాన నిమ్మ సాగు ప్రాంతాలు, ప్రధాన మార్కెట్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వేసవి దెబ్బకు పెరిగిన డిమాండ్
ఏప్రిల్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు చల్లని పానీయాలవైపు మొగ్గుచూపుతున్నారు. నిమ్మరసం, సోడా, శర్బత్, లెమన్ టీ, పానకాలు వంటి పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గత నెలలో రూ.120 నుంచి 140 మధ్య ఉన్న నిమ్మకాయ ధరలు, కేవలం కొన్ని వారాల్లోనే రూ.160 దాటి ఇప్పుడు రూ.200కు చేరడం వినియోగదారులను షాక్‌కు గురిచేస్తోంది. చిన్నచిన్న దుకాణాల్లో ఒక్క నిమ్మకాయను రూ.20కు అమ్ముతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లా రాష్ట్రంలో నిమ్మ సాగుకు ప్రసిద్ధి. ముఖ్యంగా గూడూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తోటలున్నాయి. అయితే ఈ ఏడాది వాతావరణ మార్పులు, నీటి కొరత కారణంగా దిగుబడులు తగ్గాయి. పండ్లు పూర్తిగా పరిపక్వం కాకముందే చెట్ల నుంచి రాలిపోవడం, తోటల్లో ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మార్కెట్‌కు సరుకు రాక తగ్గింది. రాయలసీమలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కర్నూలులో నిమ్మరసం వినియోగం భారీగా పెరిగింది. జ్యూస్ స్టాళ్ల వద్ద రోజంతా కస్టమర్ల రద్దీ కొనసాగుతున్నప్పటికీ, ధరలు పెరగడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్లాస్ నిమ్మరసం ధర రూ.20 నుంచి రూ.25కు పెరిగింది. కాగా కృష్ణా జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ అత్యధికంగా ఉంది. విజయవాడ, మచిలీపట్నం వంటి నగరాల్లో నిమ్మకాయ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జ్యూస్ స్టాళ్లు ఎక్కువగా ఉండటంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది.
ప్రధాన మార్కెట్లలో కొరత
గూడూరు మార్కెట్లో ఉదయం వచ్చిన సరుకు సాయంత్రానికి పూర్తవుతోంది. హోల్‌సేల్ ధరలు పెరగడంతో చిల్లర వ్యాపారులు కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అలాగే తెనాలి మార్కెట్ రాష్ట్రానికి కీలక సరఫరా కేంద్రం. ఇక్కడి వేలం ధరలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా చిల్లర ధరలపై ప్రభావం పడుతోంది. వ్యాపారుల ప్రకారం సరుకు తగ్గిపోవడంతో పోటీగా ధరలు పెరుగుతున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు:
వేసవి కారణంగా నిమ్మరసం వినియోగం 100 శాతం వరకు పెరగడం, ఉత్పత్తి తగ్గుదల, వాతావరణ మార్పులు, నీటి కొరత, పంట నష్టం. అలాగే రవాణా సమస్యలు, డీజిల్ ధరలు, కార్మిక ఖర్చులు పెరగడం. గత నెలల్లో తక్కువ ఉత్పత్తి రావడంతో నిల్వలు తగ్గాయి. నిమ్మకాయ ధరలు పెరగడంతో జ్యూస్ స్టాళ్లు గ్లాసుకు రూ.5 పెంచాల్సి వచ్చింది. ధరలు పెరగడంతో తమ లాభాలు తగ్గాయని, కస్టమర్లు తగ్గకుండా ఉండటానికి నాణ్యత తగ్గించలేమని విక్రేతలు చెబుతున్నారు.
వ్యాపారుల అంచనా ప్రకారం మే నెలలో ఎండలు మరింత పెరిగితే కిలో రూ.230కు చేరే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది. ధరలు పెరగడం రైతులకు కొంత లాభదాయకమే అయినా, మధ్యవర్తుల ఆధిపత్యం వల్ల పూర్తి ప్రయోజనం రైతులకు చేరడం లేదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రైతు బజార్లలో నేరుగా రైతుల నుంచి సరఫరా పెంచడం, నిల్వదారులపై పర్యవేక్షణ, ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
