104 సేవల్లో కీలక మార్పులు

104 సేవల్లో కీలక మార్పులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రోగాల నివారణకు ముందస్తు చర్యల కోసం సమగ్ర వైద్య పరీక్షల విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 104 సంచార వైద్య వాహనాల ద్వారా ఈ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రూ. 162.72 కోట్ల వ్యయంతో ప్రతి వ్యక్తికీ 47 రకాల వైద్య పరీక్షలు చేపట్టే పథకానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం ఆమోదం తెలిపారు. ఎన్సీడీ సర్వేలో వివిధ జబ్బులకు గురైన లేదా అవకాశం ఉన్న వారితో పాటు సంక్షేమ విద్యా వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులను కలుపుకుని ఏడాదికి 56 లక్షల 40 వేల మందికి ఒక్కొక్కరికీ 47 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.


కొత్త పుంతలు తొక్కనున్న 104 సేవలు

ఇప్పటి వరకు 104 సంచార వైద్య వాహనాల ద్వారా గ్రామ స్థాయిలో 15 రోజులకోసారి 6 రకాల పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. అవి— ర్యాండమ్ బ్లడ్ షుగర్, యూరిన్ షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్, యూరిన్ అల్బుమిన్ మరియు గర్భధారణ నిర్ధారణకు మూత్ర పరీక్ష. ఇవి కూడా ఎక్కువగా ఖచ్చితమైన ఫలితాలు ఇవ్వని ర్యాపిడ్ కిట్స్ ద్వారా జరుగుతున్నాయి. దీంతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో వ్యక్తుల డిసీజ్ ప్రొఫైల్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారీ జరగడం లేదు. దీనికి భిన్నంగా నూతన 104 సేవల అమల్లో భాగంగా 11 అంశాలకు సంబంధించి గుర్తించిన ప్రతి వ్యక్తికి మొత్తం 47 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.


పరీక్షలు ఇలా

కాలేయ సంబంధిత పరీక్షలు (ఎల్ఎఫ్) – 8
మూత్ర విశ్లేషణ – 6
కొవ్వు సంబంధిత పరీక్షలు (లిపిడ్ ప్రొఫైల్) – 5
తెల్ల రక్త కణాల కౌంట్ – 5
ఎర్ర రక్త కణాల కౌంట్ – 5
ఎలక్ట్రోలైట్ పరీక్షలు – 4
మూత్రపిండాల పరీక్షలు (ఆర్‌ఎఫ్) – 3
గ్లూకోజ్ పరీక్షలు – 3
కోయాగ్యులేషన్ పరీక్షలు – 2
ఇఎస్ఆర్ (ఇన్ఫెక్షన్‌కు సంబంధించినది) – 1
ఇతర పరీక్షలు – 5


ప్రయోజనం ఇదీ

ఈ సమగ్ర వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా పౌరుల ఆరోగ్య స్థితికి సంబంధించి వ్యక్తిగత స్థాయిలో డిసీజ్ ప్రొఫైల్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు రూపొందించబడతాయి. సంజీవని పథకం కింద ఆయా వ్యక్తులకు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్తులో రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు అందిస్తారు. ఈ సమగ్ర వైద్య పరీక్షల ప్రారంభం రాష్ట్ర ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా ఎంతో ప్రాముఖ్యమైన చర్య అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


సర్వీస్ ప్రొవైడర్ పాత్ర

తొలి దశలో ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మొత్తం 904 వాహనాలతో 104 సంచార వైద్య సేవలను నిర్వహిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ ప్రతి వాహనంలో సెమీ ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్, సీబీసీ మెషీన్ (3 పార్ట్ అనలైజర్), మైక్రోస్కోప్, ఇంక్యూబేటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా వివిధ పరీక్షలకు అవసరమైన రియాజెంట్లు, ఇతర సామగ్రిని కూడా సమకూర్చాలి. ప్రతి వాహనం రోజుకు 20 మందికి చొప్పున, నెలలో 26 పని దినాల్లో మొత్తం 520 మందికి 47 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రెండు నెలల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

Leave a Reply