డీఎస్సీపై వైసీపీ నిరసన.. కలెక్టర్‌కు వినతి

విజయవాడ, ఆంధ్రప్రభ: మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు.
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని రామా క్లాత్ షోరూమ్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, తిరువూరు ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నిరాశపరిచిందన్నారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రచారం చేసి చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని విమర్శించారు.

డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరారు.

డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, డీఎస్సీలో అనర్హులకు పోస్టులు ఇచ్చారని, స్పోర్ట్స్ కోటా పేరిట అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరగలేదన్నారు. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
