హరిత ఏలూరు నిర్మాణానికి ప్రజలంతా భాగస్వాములు కావాలి
హరిత ఏలూరు నిర్మాణానికి ప్రజలంతా భాగస్వాములు కావాలి
- ఎమ్మెల్యే బడేటి చంటి
ఆంధ్రప్రభ, ఏలూరు బ్యూరో : భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఐక్యంగా తీసుకునే స్ఫూర్తివంతమైన నిర్ణయాలు ఆదర్శంగా అమలు కావాలన్నదే తన అభిమతమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరిత ఏలూరు నిర్మాణానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణకు సైకిల్ వినియోగమే ఉత్తమ మార్గమని సూచిస్తూ ఏలూరు నగరంలోని 20వ డివిజన్‌లో స్వయంగా సైకిల్ తొక్కి ప్రజల్లో స్ఫూర్తి నింపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన ఇంధన పొదుపు సూత్రాలను అందరూ ఆచరించాలని హితవు పలికారు. కాలుష్య నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణలో సైకిల్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అనంతరం కృష్ణ కాలువ గట్టు వెంబడి, పంపుల చెరువు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి మొక్కలు నాటి వాటికి రక్షణగా గార్డులు కూడా ఏర్పాటు చేశారు.

ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. చెట్ల పెంపకమే భావితరాలకు నిజమైన సంపద అని పేర్కొంటూ, పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ. భాను ప్రతాప్, స్థానిక కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

