బీఆర్ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి..
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : బీఆర్ఎస్ శనివారం (జూలై 18) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించనున్న ‘యువ సంగ్రామ సభ’కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో సభ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. నిరుద్యోగ యువత సమస్యలను ప్రజల ముందుకు తీసుకువస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈ సభను నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో పాల్గొననుండగా, రాష్ట్రవ్యాప్తంగా యువత ‘చలో సరూర్‌నగర్’ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది.
సభకు తొలుత పోలీసుల నుంచి అధికారిక అనుమతి లభించకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం హైకోర్టు షరతులతో సభ నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
తెలంగాణ భవన్లో సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయలేదని ఆరోపించారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసు, విద్యాశాఖల్లో దాదాపు 40 వేల ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ చేపట్టలేదని ఆరోపించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు కోరుతున్న యువతపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించగా, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
