ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీజేపీ ‘ఇందూరు రణభేరి’.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

నిజామాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శుక్రవారం ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ నాయకత్వంలో పాత కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బకాయిల చెల్లింపుల కోసం వేల కోట్ల రూపాయలు అవసరమున్నప్పటికీ కేవలం రూ.200 కోట్లు మాత్రమే విడుదల చేయడం విద్యార్థులను మోసం చేసినట్టేనని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భూముల విక్రయాల ద్వారా వచ్చిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్రంలోని సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమైన పథకమని, దానిని నిర్వీర్యం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోనే రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో బకాయిలు విడుదల చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రజాప్రతినిధులు, జిల్లా నాయకులు, విద్యార్థి విభాగం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.