810 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్

మొత్తం సీట్లు 9,650కు పెంపు..

ఈ ఏడాది నుంచే నీట్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి అదనంగా 810 ఎంబీబీఎస్ (MBBS) సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (NMC) ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

తాజా ఆమోదంతో తెలంగాణలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 8,840 నుంచి 9,650కు పెరిగింది. దీంతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీట్లు మరింత పెరగడంతో పోటీ కొంతవరకు తగ్గే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.

కొత్తగా మంజూరైన 810 సీట్లలో 110 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలలకు, 600 సీట్లు ప్రైవేట్ వైద్య కళాశాలలకు, 100 సీట్లు డీమ్డ్ యూనివర్సిటీలకు కేటాయించారు. ఈ అదనపు సీట్లన్నింటినీ 2026–27 విద్యా సంవత్సరానికి జరిగే నీట్ (NEET) కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలో వైద్య విద్య విస్తరణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా గత కొన్నేళ్లుగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు, సీట్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తాజా ఎన్‌ఎంసీ నిర్ణయంతో తెలంగాణలో వైద్య విద్యా మౌలిక వసతులు మరింత బలోపేతం కానుండగా, రాష్ట్ర విద్యార్థులకు మెడిసిన్ చదివే అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.

నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ కొత్త సీట్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియలో మరింత మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.