అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం..

అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం..
హాజరైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాదు వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో శ్రీనాథ్‌రావు అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాదు , గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం, పోలవరం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం శుభపరిణామని వసంత కృష్ణప్రసాదు అన్నారు. ఏపీలో ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో అభివృద్ధి నిరోధక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో సంస్కరణలు చాలా వేగంగా అమలవుతున్నాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ శరవేగంగా అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ , చంద్రబాబు, లోకేశ్ మూడుతరాల ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులతో పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేశ్ చొరవతో రాష్ట్రానికి పలు రూపాల్లో పెట్టుబడులు వచ్చాయని ప్రస్తావించారు. తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని వసంత కృష్ణప్రసాదు తెలిపారు.
