ORR Accident | ఆటో ట్రాలీని ఢీకొట్టిన లారీ.. ఇద్దరి మృతి

మెదక్ జిల్లా వాసులు అక్కడికక్కడే దుర్మరణం
కీసర సమీపంలో ప్ర‌మాదం

ORR Accident | ఆంధ్రప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై (ఓఆర్ఆర్) కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలానికి చెందిన రాములు (60), రషీద్ (40) గొర్రెలను ఆటో ట్రాలీలో తరలిస్తూ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది.

ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని భారీ వాహనం ఆటో ట్రాలీని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో రోడ్డుపక్కన ఉన్న రాములు, రషీద్‌పై కూడా వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం, దాని డ్రైవర్ కోసం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.