భరత్ రెడ్డి అరెస్ట్ కాలేదు.. డ్రగ్స్ తీసుకోలేదు: ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి

‘సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిరాధారం’

మంగళ్‌హాట్ పోలీసులు ఇంటికి వచ్చి విచారణ చేసిన మాట వాస్తవమేనని వెల్లడి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తన కుమారుడు భరత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నారని, మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గురువారం ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు తమ నివాసానికి వచ్చి విచారణ నిర్వహించిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో తన కుమారుడు డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమైనట్లు పేర్కొన్నారు.

కామన్ ఫ్రెండ్స్ ఫోన్ నంబర్ల జాబితాలో ఉన్న వ్యక్తుల్లో ఒకరి వద్ద లభించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారని, అంతకు మించి ఎలాంటి అంశం లేదని వెంకట్రాంరెడ్డి వివరించారు.

“భరత్ రెడ్డి అరెస్ట్ కాలేదు. డ్రగ్స్ కూడా తీసుకోలేదు. దీనికి విరుద్ధంగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు.

సోషల్ మీడియాలో నిర్ధారణ లేని వార్తలు, అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి కోరారు.